బాల నటిగా శ్రీదేవి తొలి ఫొటో ఇదే..తీసెందెవరో తెలుసా

updated: February 27, 2018 13:08 IST
బాల నటిగా శ్రీదేవి తొలి ఫొటో ఇదే..తీసెందెవరో తెలుసా

బాలనటిగా 4వ ఏటనే చలనచత్ర రంగంలోకి శ్రీదేవి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . అప్పుడు ఆమెకు సినిమాల్లో అవకాశాలు కోసం...దర్శక,నిర్మాతలకు  పంపటానికి ఫొటోలు కావాల్సి వచ్చాయి. ఆ సమయంలో తొలి ఫొటో షూట్ జరిగింది.  ఆ ఫొటో షూట్ చేసింది మరెవరో కాదు  ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ జి.యన్.భూషణ్ (గొల్లపల్లి నాగభూషణం). శ్రీదేవి, చిన్ననాటి బాల్యమిత్రురాలు కుట్టి పద్మినితో వున్న ఫొటోని  జి.ఎన్.భూషణ్ అద్బుతంగా తీసారు. శ్రీదేవి తర్వా కాలంలో భూషణ్ గారిని కలిసి  ఈ ఫొటో కాపీ తీసుకుని  తన దగ్గర దాచుకున్నారు. 

అప్పట్లో శ్రీదేవి...తన  తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్‌లతో మద్రాస్‌లోని టి.నగర్ పెరియర్ వీధిలో ఉండేవారు,  అదే ఇంట్లోనున్న స్టిల్ ఫొటోగ్రాఫర్ జి.యన్.భూషణ్ తో ఆ కుటుంబానికి సన్నిహిత స్నేహ బాంధవ్యం ఏర్పడింది.  దాంతో కొత్తగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న  తమ కుమార్తె శ్రీదేవి కెరీర్ కు పనికొచ్చేటట్టు ఫొటోలు తీయమని అడిగారు. ఎంతో ముద్దుగా చక్కగా ఉండే శ్రీదేవిని అప్పుడు భూషణ్ గారు.. రకరకాల భంగిమలలో  ఫొటోలు తీసారు. ఆ విషయం గుర్తుంచుకుని శ్రీదేవి...అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు భూషణ్ గారిని ఆప్యాయంగా పలరిస్తూండేవారు. ఆ విషయం భూషణ్ గారి సన్నిహితులు అందరికీ తెలుసు.

 

జి.యన్.భూషణ్ (గొల్లపల్లి నాగభూషణం) గారిని ఓ సారి గుర్తు చేసుకుంటే...

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జి.ఎన్‌.భూషణ్‌ దశాబ్దాల పాటు ఎన్నో సినిమాలకు నిశ్చల ఛాయాగ్రహకుడిగా పనిచేసారు.హేమామాలిని, కాంచన, జమున లాంటి స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వాళ్ల తొలి ఫొటోలు తీసింది భూషణే. ఆయన ఫ్లాష్‌ పడిందంటే పెద్ద హీరోయిన్‌ అవ్వాల్సిందే అని అప్పట్లో ఓ టాక్ నడుస్తూండేది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, భానుమతిలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.  ఓ టైమ్ లో ఎఎన్నార్, భానుమతి కాంబినేషన్ లో సొంత దర్శకత్వంలో సినిమా కూడా ప్లాన్ చేసారు. అయితే అది రకరకాల కారణాల వల్ల ముందుకు వెళ్లలేదు.

మద్రాస్‌లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా రిటైర్ అయి, హైదరాబాద్‌లో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా వున్న రోజులలో ఆయన్ని హైదరాబాద్ కు తీసుకు వచ్చి స్పెషల్ ఆఫీసర్ విజువల్ మీడియా సెల్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిగా నియమించారు. అప్పటి ఎన్నికల సమయంలో ప్రచారానికి కావల్సిన అన్ని ఫొటోలనూ భూషణ్‌ చేతే తీయించారు.

భూషణ్‌ గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. పూర్తిపేరు గొల్లపల్లి నాగభూషణం. ఆయన కుటుంబంలో అందరూ లాయర్లే.  అయితే ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. చదువుకొనే రోజుల్లో నిర్మాత ఎన్‌.ఎస్‌.మూర్తితో పరిచయమైంది. ఆయనే భూషణ్‌ని మద్రాస్‌ తీసుకెళ్లారు. అక్కడ ఫొటోగ్రఫిపై పట్టుసాధించి సినిమాల్లోకి అడుగుపెట్టారు. 'సాక్షి' సినిమా నుంచీ బాపుతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ''ఫొటో అంటే నాలుగు ఫ్రేముల మధ్య ఇరుక్కొన్న బొమ్మ కాదు.. అదో అందమైన జ్ఞాపకం. ఓ పెయింటింగ్‌లా ఉండాలి'' అని ఎప్పుడూ చెప్తూండేవారు ఆయన.

comments